నిశాచరుల లోకం
నిశ్చల నిర్జీవ తటాకమై
సుడిగాలికీ చెదరని
నల్లని వస్త్రమై
వెరవక బెదరక నిలిచిన
నిశి తెరలను
చీల్చుకుంటూ
ముందుకు నడుస్తున్నా
జీవమెక్కడో
తెలుసుకుందామని
జీవితమంటే ఏమిటో
నేర్చుకుందామని...
వడివడిగా నడిచిన
పాదాలు ఎందుకో ఆగిపోయాయి
అంత చీకటిలోనూ ఏదో
గుడ్డివెలుతురు
పూరిగుడిసెలో ఓ తల్లి
తనబిడ్డకు ముద్దలు
పెడుతోంది
బక్కచిక్కిన
ప్రాణానికి ఊపిరి నింపుతోంది
మాసినబట్టలు వాడిన
పెదాలు
అది చితికిన బతుకేనని
తెలుస్తూనే ఉంది...
ఇది కాదేమో జీవితమని
అడుగులు కదిపాను
కటికచీకటిలో బాటలు
తెలియకున్నా
రాళ్ళూ రప్పలు మానని
గాయాలవుతున్నా
ఆగిపోలేదు నా నడక...
పూరి గుడిసెల మరో వాడ
పలకరించింది
అక్కడేదో ఉత్సవంలా
ఉంది
అందరూ ఒకే చోట చేరి
పండగ చేసుకుంటున్నారు
ఆత్మీయంగా
పలకరించుకుంటున్నారు
తాగుతున్నారు
తూలుతున్నారు
సరసాలూ విరసాలూ
బావామరదళ్ళ సరాగాలు
పూరి గుడిసెల విరిగిన
తలుపులను తొంగి చూస్తే
ఎండిన గిన్నెలు ఈగల
మోతలు
దమ్ము ఆపుకోలేక
దగ్గుతున్న ముసలమ్మ
ఇదికూడా జీవితం
కాదేమోనని
అక్కడినుంచి
కదిలాను...
క్రమంగా చీకట్లు
తొలిగిన భావన
ఇంకా తొలిపొద్దే
పొడవలేదు
వెలుగులేమిటా అని చూసా
దూరంగా ఏదో నగరం
మెరుస్తూ కనిపించింది
నవ్వులు కేరింతలు
ఆనందోత్సాహాలు
ఇంద్రధనుస్సు తోరణాలు
మనసు పురివిప్పింది
భారమైనపాదాలలో తెలియని
సత్తువ చేరింది
అడుగుల వేగం
పెరిగింది...
రంగురంగుల ప్రపంచం
ఎవరిని చూసినా
పొంగిపొరలే ఆనందం
సందడే సందడి
జీవనమజిలీని చేరుకున్న
అనుభూతి నాలో...
విలాసమైన భవనాలు
కళ్ళు జిగేల్ మనిపించే
సదుపాయాలు
సుగంధ పరిమళ ద్రవ్యాలు
కన్నీరు ఒలకని నయనాలు
వేదనే కానరాని
వదనాలు...
నగరంతా కలియతిరిగాను
అన్ని వీధులనూ
పలకరించాను
ఈ నగరంలో కన్నీళ్ళే
లేవా
ఎవరికీ బాధలు లేవా
ఇంత ఆనందం ఎలా
ఇదేనా అసలైన జీవితం...
గజిబిజి నడకలతో
ఎదురుగా వస్తున్న
ఓ పెద్దమనిషిని అడిగేసాను
భళ్ళున నవ్వేసాడు ఆ
మనిషి
అసలు మాకు బాధలెందుకు
కన్నీరెందుకు
మేము మనుషులమైతేగా
అంటూ
తూలుతూ ముందుకు
వెళ్ళిపోయాడు
అప్పుడు తెలిసింది
నాకు
ఇది ప్రాణమున్న శవాలు
తిరిగే లోకమని
మనసూ మమతలకు
తిలోదకాలిచ్చి
ఒకరిని మరొకరు
చంపుకున్న నిశాచరుల స్థానమని...
భారమైన అడుగులను
బలవంతంగా కదిలిస్తూ
వెనక్కి నడిచాను
ఇక జీవితం దొరకదని
మనస్వినీ...
Super Bhai..liked it
ReplyDelete