మనసు దీపం
కాటుక కన్నుల
నల్లని రక్కసి
జడలు
విప్పుతున్న వేళ
శశిని మింగిన
నిశి
వలలు విసురుతున్న
వేళ
మసిలాంటి
నిశిలో
ఉషస్సు సమాధి
అయ్యే వేళ
దేహానికి తప్ప
దాహానికి పనికిరాని
కడలి కెరటాలు
సునామీలైన వేళ
శూన్యం నుంచి
మరో శూన్యంలోకి
అడుగులు వేసే
వేళ
నిర్వేదమైన
హృదయం
చిరుకాంతికై
కన్నులు తెరిచిన వేళ
కనుచూపు మేరలో
వెలుగేలేని వేళ
మౌన సంద్రమైన
నా మనసు
నిన్నే
కోరుకుంటుంది
నీ కన్నుల
కాంతిని
జీవనరేఖలని
మురిసిపోతుంది
నీ నవ్వుల
వెలుగులను
గెలుపు బాటలని
నమ్ముతుంది
చీకటి ముసిరిన
మనసు
నీ మనసు దీపం
పంచన చేరాలని
ఆ వెలుగుల
నీడలో సేదతీరాలని
ఆరాటపడుతుంది
ముభావమైన నా
మనసులో
భావాలు రేపే
మనసు దీపం నీవే కదా
మనస్వినీ
No comments:
Post a Comment