Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 29 December 2014

అమ్మ...



అమ్మ...

మేమన్నది తను వినదు...
తను విన్నది అసలుండదు...
అయినా అన్నీ వింటుంది...
అన్నీ అంటుంది...
అన్నీ చేస్తుంది...
అన్నీ ఉన్నాయంటుంది...
అన్నీ విన్నానంటుంది...
ఒక మాటకు మరో మాటకు...
పొంతన ఉండదు...
ఓ మాట తూటాలా పేలితే...
మరో మాట నవ్వులే రువ్వుతుంది...
మాలో మాకు మాటల పేచీలు...
తనకు అవే అనిపిస్తాయి సరదాలు...
నాడు అలా అన్నావు...
ఇప్పుడిలా అంటున్నావేమని ...
నిలదీస్తుంది...
రహస్యాల్ని విప్పేస్తుంది...
లేనివన్నీ రహస్యాలే అంటుంది...
ఆగ్రహంతో నీ మొహమే చూడను పో అన్నా...
మరు రోజే వచ్చేస్తుంది...
దగ్గరికెళితే లాలిస్తుంది...
తన రెక్కల్లో దాచుకుంటుంది...
దగ్గరికి తీసుకుంటే...
గువ్వపిట్టలా ఒదిగిపోతుంది...
పసిబిడ్డగా నవ్వుతుంది...
పెద్దదానిలా సలహాలిస్తుంది...
ప్రతిరోగానికీ వైద్యం చెబుతుంది...
ప్రతి సమస్యకూ పరిష్కారమిస్తుంది...
అప్పుడప్పుడూ తానే సమస్యైపోతుంది...
వయస్సు ఐదేళ్లే...
అవును డెబ్భయ్ ఐదులో డెబ్భయ్ తీసేస్తే...
వయసు ఐదే కదా...
ఆమె పరిష్కారమైనా...
తానే సమస్య అయినా...
ఆమె మాకు ఆరాధ్యం...
ఆ మాటల మారాణి రెక్కలలోనే...
నా బాల్యం గడిచిపోయింది...
అవును ఆమె...
అమ్మ ...
మనస్వినీ...

No comments:

Post a Comment